-->

AP Teachers Discussion Forum Powered by www.apteachers.in

సరుకుగా మారుతున్న చదువు
       
 విద్యను సరుకుగా మార్చితే తప్పేంటి? అనే ప్రశ్న తక్షణమే ఉదయించవచ్చు. దీనివల్ల ఐదు స్పష్టమైన తక్షణ సమస్యలున్నాయి. అంతిమంగా ఇవన్నీ మానవ దాస్యాన్ని మరింత పాతుకుపోయేలా చేసి, దాని కొనసాగింపుకు కారణమౌతాయి. మొదటిదీ, అత్యంత స్పష్టమైనదీ ఏమంటే, మహత్తర మానవ ఆలోచనా స్రవంతికి పరిచయమయ్యే సాధనంగా ఉండవలసిన విద్య స్థానభ్రంశం చెంది డబ్బు సంపాదించే సాధనంగా మారటం. విద్యనార్జించేవారి డబ్బు వ్యామోహం సరుకుల ఉత్పత్తికి వర్తించే తర్కాన్ని వంటబట్టించుకునేలా చేస్తుంది. దీని వల్ల అలా వంటబట్టించుకున్న వ్యక్తికే కాక మొత్తంగా సమాజానికే చేటు కలుగుతుంది
            విద్యను సరుకుగా మార్చటం వర్తమాన భారతదేశ ప్రధాన లక్షణాలలో ఒకటిగా ఉంది. విద్యా వ్యవస్థ నుంచి బయటికొచ్చిన వారి శ్రమశక్తి సరుకుగా మారటమే కాకుండా ఈ సరుకును ఉత్పత్తిచేసే విద్యా వ్యవస్థే సరుకుగా మారింది. మరో విధంగా చెప్పాలంటే, ఒక సరుకు (వారు నేర్చుకున్న విద్య) అనే సాధనం ద్వారా మరో సరుకును (చదువుకున్న వారి శ్రమశక్తి) ఉత్పత్తిచేసే ప్రక్రియగా విద్యారంగం తయారైంది. ఇక్కడ తక్షణమే ఉదయించే ప్రశ్న ఏమంటే చదువుకున్నవారందరూ ఉద్యోగంలో చేరాలనుకుంటారు. అంటే శ్రామిక మార్కెట్‌లో చేరి తమ శ్రమ శక్తిని అమ్ముకోవాలనుకుంటారు. మరో మాటలో చెప్పాలంటే వారి శ్రమశక్తి ఎప్పుడూ సరుకే. అది అంతిమంగా ఉత్పత్తి అయ్యే సరుకు(విద్యావంతుల శ్రమశక్తి) నాణ్యతను పెంచేదిగానే ఉంటుంది కదా అని కొందరు వాదించవచ్చు. కాబట్టి, విద్య సరుకుగా మారటంపై ఎవరైనా ఎందుకు ఆందోళన చెందాలి? 'సరుకు' అనే పదం అర్థంలోనే దీనికి సమాధానం ఉంది. మారకం కోసం సరఫరా చేసిన ప్రతిదీ దానికదే సరుకు కాజాలదు. ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ తరువాత మార్క్సిజాన్ని విశదీకరించటంలో అత్యంత ప్రముఖుడిగా ఉన్న కార్ల్‌ కాట్‌స్కీ 1887లో రాసిన 'ద ఎకనామిక్‌ డాక్ట్రిన్స్‌ ఆఫ్‌ కార్ల్‌మార్క్స్‌' అనే గ్రంథంలో సరుకు గురించి అత్యంత ముఖ్యమైన ప్రతిపాదన చేశారు. అదేమంటే, సరుకును అమ్మేవారికి దక్కేది ప్రత్యేకమైన మారకపు విలువ తప్ప ఉపయోగపు విలువలాంటి ఎటువంటి సంతృప్తి లేదా ప్రయోజనం ఉండదు. (ఈ అవగాహన బూర్జువా అర్థశాస్త్రం మూలాలనే పెకలిస్తుంది. మార్కెట్‌లో మారకమయ్యే ప్రతి సరుకూ దాని అమ్మకందారు, కొనుగోలుదారుల 'ప్రయోజనాని'కి వనరుగా ఉంటుందని బూర్జువా అర్థశాస్త్రం చెబుతుంది.) ఇదే సరుకు లక్షణం. కాట్‌స్కీ నిర్వచనాన్ని మరికొంత విస్తృత పరచవచ్చు. మారకపు విలువగా మాత్రమే పరిగణిస్తున్న సరుకు అమ్మకందారు తన సరుకును తయారుచేయటానికి వాడినదేదీ తనకు 'సంతృప్తి' లేదా 'ప్రయోజనాన్ని' ఇవ్వజాలదని గ్రహిస్తాడు. ఉదాహరణకు ఒక ఉక్కు తయారీదారు ఇనుప ఖనిజాన్ని ఉపయోగించి ఉక్కును తయారు చెయ్యటంలో ఎటువంటి ఆనందాన్నిగానీ, సంతృప్తినిగానీ అనుభవించడు. తాను తయారు చేసిన ఉక్కుకు ఎంత డబ్బు వస్తుందనే విషయాన్ని గురించీ, దానిలో తనకు వచ్చే లాభాన్ని గురించీ తప్ప మరే విషయం అతనికి పట్టదు.
అంతర్జాతీయ పెట్టుబడి అవసరాలు తీర్చేందుకే ...
                    ఈ దశకు రాకపూర్వం, ఉదాహరణకు సంప్రదాయ భారతదేశంలోని వర్ణ వ్యవస్థకు చెందిన యాజమాన్య వ్యవస్థలో మహా ఉంటే సరుకు ఉత్పత్తికి చెందిన తొలి రూపం లేక అసమగ్ర సరుకు ఉత్పత్తి ఉండి ఉంటుంది కానీ పూర్తిస్థాయి సరుకు ఉత్పత్తి మనకు లేదు. మనం విద్య సరుకుగా మారిందని మాట్లాడుకుంటున్నప్పుడు అది పూర్తిస్థాయి సరుకుగా మారిందనే నిజమైన అర్థంలోనే మాట్లాడుకుంటున్నట్లుగా భావించాలి. విద్యనార్జించేవారు దానిని ఆనందానికి వనరుగానో లేక అధ్యయనంగానో లేక జ్ఞానాభివృద్ధి ప్రక్రియగానో చూడక మార్కెట్‌లో తాము దానితో ఎంత డబ్బును సంపాదించగలుగుతాము అనే ధోరణిలో ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. భారతదేశంలో విద్య సరుకుగా మార్చబడుతోంది. ఇంతకు ముందు ఉదాహరణలో వివరించినట్లు ఉక్కు ఉత్పత్తిదారు ఉక్కు మారకపు విలువలో మిగులును తనదిగా చేసుకోజూసినట్లుగా విద్యనార్జించినవారు తాము నేర్చుకున్న విద్య అనే ఉత్పత్తి కారకం(ఇన్‌పుట్‌) ద్వారా తమకు ఎంత ఆదాయం వస్తుందో చూసే ధోరణి రూపంలో విద్య సరుకుగా మార్చబడుతోంది. దీనికి అనుగుణంగా విద్య అనే సరుకు ఒక నాణ్యమైన ఉత్పత్తి కారకంగా తీర్చిదిద్దబడి అలాంటి విద్యను అందించేవాడు తనకు అత్యంత లాభసాటిగా ఉండే విధంగా దాని ధరను నిర్ణయిస్తాడు. ఇప్పుడు, ఈ విధంగా విద్యను సరుకుగా మార్చడమంటే 'విద్యావంతులు' మార్కెట్‌లో అమ్మే శ్రమ శక్తి గతంతో పోలిస్తే పూర్తి స్థాయి సరుకుగా మారుతుంది. ఇలా విద్య పూర్తి స్థాయి సరుకుగా మారటానికి కారణం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం. ఎందుకంటే, విద్యావంతులు తమ శ్రమ శక్తిని అమ్ముకుంటున్న మార్కెట్‌ మీద అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నది. అంటే ఆ మార్కెట్‌ 'నియమనిబంధనల'ను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడే నిర్ణయిస్తుంది. ఏదో మెట్రోపాలిటన్‌ ఏజన్సీని అనుసరించి ప్రపంచ వంద అగ్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో భారతీయ వర్సిటీలు ఉన్నాయా అని మన నయా ఉదారవాద పాలకులు ఆత్రుతతో చూస్తుంటారు. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజన్సీలలాగానే ఈ రాంకులను ఇచ్చే ఏజన్సీలు 'విద్యావంతుల' శ్రమశక్తి నాణ్యత గురించి దానిని కొనబోయే అంతర్జాతీయ పెట్టుబడికి సమాచారాన్ని అందిస్తుంటాయి. మనదేశాన్ని అంతర్జాతీయ పెట్టుబడి అవసరాలకు నెలవుగా మార్చాలని చూసే మన నయా ఉదారవాద పాలకులు మన శ్రమశక్తి నాణ్యత ఏమాత్రం తగ్గినా నిస్పృహకు లోనవుతారు. అంతర్జాతీయ పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా విద్యను సరుకుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేసే పనిలో మన నయా ఉదారవాద పాలకులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
               విద్యను సరుకుగా మార్చితే తప్పేంటి? అనే ప్రశ్న తక్షణమే ఉదయించవచ్చు. దీనివల్ల ఐదు స్పష్టమైన తక్షణ సమస్యలున్నాయి. అంతిమంగా ఇవన్నీ మానవ దాస్యాన్ని మరింత పాతుకుపోయేలా చేసి, దాని కొనసాగింపుకు కారణమౌతాయి. మొదటిదీ, అత్యంత స్పష్టమైనదీ ఏమంటే, మహత్తర మానవ ఆలోచనా స్రవంతికి పరిచయమయ్యే సాధనంగా ఉండవలసిన విద్య స్థానభ్రంశం చెంది డబ్బు సంపాదించే సాధనంగా మారటం. విద్యనార్జించేవారి డబ్బు వ్యామోహం సరుకుల ఉత్పత్తికి వర్తించే తర్కాన్ని వంటబట్టించుకునేలా చేస్తుంది. దీని వల్ల అలా వంటబట్టించుకున్న వ్యక్తికే కాక మొత్తంగా సమాజానికే చేటు కలుగుతుంది.
                    రెండవది, స్వభావరీత్యా సరుకు అంటే పూర్తిగా తయారై ప్యాకింగ్‌ చేసిందని అర్థం. కాబట్టి, విద్య సరుకు కావడమంటే 'నేర్చుకోవడమనే' పేరుతో ప్యాక్‌ చేసిన విషయాలను విద్యార్థులకు అందించటం. పర్యవసానంగా సృజన కుంటుబడుతుంది. తనకంటూ ఒక అవగాహన ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే, మౌలికత, కల్పనాశక్తి, సృజనలను సరుకుగా మార్చిన విద్య నాశనం చేస్తుంది. ఈ తెగులు పాఠశాలలోనే ప్రారంభమవుతుంది. విద్యార్జనను ఒక ప్యాకేజీగా అందుకుని దానిని సాధ్యమైనంత వరకూ ఉన్నది ఉన్నట్లుగా పరీక్షలో దించటమే 'విద్య' అనే భావన మనకు ఉండనే ఉంది. ప్యాకేజీ దెబ్బ తినకుండా, ఏమీ మార్పులూ, చేర్పులూ చేయకుండా ఎంత జాగ్రత్తగా అందజేయగలిగితే అందజేసిన వారికి ఫలి తం అంత బాగా ఉంటుంది. ఇది మార్క్స్‌ 'సరుకుల ఆరాధన లేక వ్యామోహం' అనే భావనకు సజీవ ప్రతిబింబం.
కొరవడిన సామాజిక సున్నితత్వం
             విద్య సరుకుగా మారడం వల్ల అది సామాజిక సున్నితత్వం నుంచి పూర్తిగా వేరుపడిపోవడమనేది మూడవ సమస్య. అలాంటి విద్య ఎలాంటి సామాజిక పాత్రనూ పోషించే సామర్థ్యం కలిగి ఉండదు. అలాగే, విద్యార్జన చేసేవారిని సాధారణంగా మానవ జీవన స్థితిని గురించి పట్టించుకునేలా చేయదు. లేక తోటి మనుషులు ఎలా బ్రతుకుతున్నారో వారు తెలుసుకునేలా చేయదు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక-ఆర్థిక సమానత్వం, స్త్రీ-పురుష సమానత్వం, కుల వ్యవస్థను అధిగమించడం లాంటి రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను యువతీయువకులకు అందించటంలో, ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే 'జాతి నిర్మాణం'లో విద్య పాత్ర బలహీనపడుతుంది. భారతదేశంలో విద్యావంతులందరికీ పైన వివరించిన విలువలు లేవని చెప్పడం ఈ విశ్లేషణ ఉద్దేశం కాదు. ఈ విలువలకు వనరుగా ఉండవలసిన విద్యావ్యవస్థ రోజురోజుకూ కుంచించుకు పోతున్నదని చెప్పటానికి మాత్రమే ప్రయత్నించాను.
                       ఈ సరుకు కూడా కేవలం కొందరికే అందుబాటులో ఉండటమనేది విద్యను సరుకుగా మార్చడం వల్ల వచ్చే నాలుగవ సమస్య. అందుబాటులో ఉండకుండా ఇది అశేష ప్రజానీకాన్ని మినహాయిస్తుంది. తద్వారా రూపం ఏదైనా సారంలో సమాన అవకాశాలను దెబ్బతీస్తుంది. సమానత్వాన్ని గణనీయంగా సాధించాలంటే కొన్ని సామాజిక తరగతులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వటంలాంటి నిశ్చయాత్మక కార్యాచరణ ఆవశ్యకత ఉంటుంది. దీన్ని పైపైన చూస్తే రూపంలో సమానావకాశాలను దెబ్బతీయటంగా కనిపిస్తుంది. వాస్తవంలో ఇది సమానా వకాశాలను సాధించే సాధనం.
                 దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రతినిధులు నేర్పుగా ఉండే ఒక వాదనను ముందుకు తెచ్చారు. ఆ వాదన ప్రకారం ఉన్నత విద్యను అభ్యసించగోరే వారందరికీ ఋణ సౌకర్యం కలుగజేస్తున్నాము. కాబట్టి అవకాశాలలో నిజమైన సమానత్వానికి ఎటువంటి భంగం వాటిల్లదు. ఈ వాదనను నేర్పుగా ముందుకు తెచ్చారనడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, సమాజంలో అందరినీ 'అప్పు తీసుకునే అర్హత' ఉన్నవారిగా పరిగణించరు. రెండవది, ఉద్యోగావకాశాలు అంతంత మాత్రంగా ఉన్న ఆర్థికవ్యవస్థలో అప్పుచేసి విద్యనభ్యసించటం పేదలకు సాధ్యపడదు. రాజ్యం ఉద్యోగ కల్పనకు హామీ ఇవ్వగలిగే స్థితిలో ఉంటే అసలు విద్యను సరుకుగా మారనివ్వదు. రాజ్యం విద్యకు నిధులు సమకూర్చకుండా సామాజిక బాధ్యత నుంచి తప్పుకోవటం విద్యను సరుకుగా మార్చడానికి వ్యతిరేకంగా స్పష్టంగా ఉన్న ఐదవ వాదన. దీని మూలాన విద్యారంగంలో ఇంతకు ముందే ఉన్న 'ద్వంద్వత్వం' మరింత తీవ్రత రమ వుతుంది. ఒకవైపు డబ్బున్న వారు చదివే అత్యున్నత విద్యా సంస్థలు, మరోవైపు అరకొర నిధులు, సిబ్బంది, పర్నిచర్‌ ఉన్న వెనకబడిన ప్రాంతా లలోని విద్యా లయాలు. భారత దేశంలో ఇది ఇప్పటికే అత్యంత ఆదోళనకర స్థాయిలో జరుగుతోంది. ఒకవైపు కులీన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మరోవైపు అధ్యాపకవర్గం, భవనాలు, నిధుల లేమితో కునారిల్లుతున్న ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు. వీటి మధ్య ఎక్కడా పోలికే లేదు. ఈ సందర్భంలో మనకు విద్య గురించి రెండు భావనలు కనిపిస్తున్నాయి: ఒకటి, సమాజం తాను నిధులు సమకూర్చిన ఒక కార్యకలాపాన్ని కొందరు వ్యక్తులకు అప్పగించడంగా విద్యను చూడటం. ఈ భావన ప్రకారం విద్యనార్జించేవారి కృషి వల్ల జ్ఞానాభివృద్ధి జరిగి సమాజంలోని లోటుపాట్లను సవరించుకునే వీలుంటుంది. ఈరకమైన విద్య వలన విద్యార్థుల్లో సామాజిక సున్నితత్వం పెరిగి వారి నుంచి ఆంటోనియో గ్రామ్‌స్కీ చెప్పినట్లు ప్రజల హితం కోరే 'సజీవ మేధావులు' ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. ఇది సమాజం ప్రగతిపథం వైపు పయనించటానికీ, సమాజంలో భాగమైన ప్రజల స్వేచ్ఛకూ అవసరం. రెండవ భావన ప్రకారం విద్య అంటే ఒక ప్యాకేజ్‌గా మార్కెట్‌లో కొనేదీ, అమ్మేదీ. కొనగలిగే తాహతు ఉన్న కొందరు వ్యక్తులు వారి సంపాదనా సామర్థ్యాన్ని పెంచుకోవటం కోసం విద్యను కొంటారు. మనదేశంలో మొదటి భావన నుంచి రెండవ భావనకు పరిణామం చెందే ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి భావన మనదేశంలో ఎన్నడూ వాస్తవీకరింపబడనప్పటికీ విద్యకు సంబంధించిన ఆలోచనా స్రవంతిలో అధికార వర్గాలలో కూడా ఈ భావన గురించిన స్పృహ ఉండేది. మొదటి భావన నుంచి రెండవ భావనకు పరిణామం చెందటం మనదేశ ప్రజలకు చేటు తెస్తుంది. 'ప్రజల పక్షాన నిలిచే సజీవ మేధావులు' లేని పరిస్థితిలో వారు రాజీపడి స్వేచ్ఛారహిత స్థితిని మౌనంగా భరించేందుకు సిద్ధపడతారు. లేక అప్పుడప్పుడు అర్థంతరంగా ఉపయోగంలేని కోపాన్ని వెళ్ళగక్కడం ద్వారా తమ అసమ్మతిని వ్యక్తపరుస్తారు. దీంతో వీరు రాజ్యం అణచివేతకు గురవుతారు. వీరి స్వేచ్ఛారహిత స్థితి మరింత దిగజారుతుంది. ఆ విధంగా, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిచే ప్రజల స్వేచ్ఛారహిత స్థితిని మరింత దిగజార్చే మరో క్షేత్రంగా విద్యారంగం మారుతుంది.

-ప్రభాత్‌ పట్నాయక్‌

Share:

Recent @ AP Teachers

T1

Sample Text

Copyright © AP TEACHERS FORUM | Powered by Blogger